ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!

, హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. గత అక్టోబర్‌ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినప్పటికీ.. కార్మికులు పెద్దగా చలించలేదు. కొంతమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువశాతం దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారు నెలన్నరకుపైగా తమకు వచ్చే జీతాలను సైతం పణంగా పెట్టి సమ్మె చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందుకు, సమాజం ముందుకు తీసుకురాగలిగారు.


ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ఖర్చులు ఇలా అనేక సమస్యలు వెంటాడినా కార్మికులు మూకుమ్మడిగా నిలబడి ఉద్యమం చేశారు. ఈ సమ్మెకాలంలో పలువురు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి.. ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మెను విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మళ్లీ సమ్మెకు పూర్వం ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం కల్పించాలని, విధుల్లోకి చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.