‘పోడు భూముల సమస్యలు తీరుస్తాం’

సాక్షి, హైదరాబాద్‌: పోడు భూముల్లో వ్యవసాయం చేసే వాళ్లకు ‘రైతు బంధు’ ఇచ్చేలా కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మాసాబ్‌ ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్‌భవన్‌లో గిరిజన ఆరో సలహా మండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు సంబంధించిన పెండింగ్‌ పనులను పూర్తి చేయడంపై చర్చించామని తెలిపారు. అదే విధంగా పోడు భూముల సమస్యలు తీరుస్తామన్నారు. గిరిజనల కోసం గురుకులాలు, కాలేజీలు పెంచాలని సభ్యులు కోరినట్లు వెల్లడించారు. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి వాటి నిర్మాణం కోసం కృష్టి చేస్తానని ఆమె పేర్కొన్నారు.







గిరిజన ఆవాసలకు  మూడు ఫేస్‌ల కరెంట్ లేదని తెలిసిందని సత్యవతి అన్నారు. కొన్ని గ్రామాలకు కరంట్‌ కూడా లేకపోవడం దురదృష్టకరమని ఆమె తెలిపారు. దీనికోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఆమె పేర్కొన్నారు. గిరిజన సలహా మండలి సూచనలు, సలహాలు కచ్చితంగా పాటించేలా చూస్తామని సత్యవతి చెప్పారు. కొంతమందికి జీతాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లుతానని ఆమె తెలిపారు. 


గిరిజన రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సత్యవతి వ్యాఖ్యానించారు. గిరిజనులకు సమస్యలపై త్వరలో ప్రధానిని కలుస్తామన్నారు. సింగరేణిలో బాక్‌లాగ్ పోస్టులు, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాల కల్పన విషయంలో ప్రత్యేక చర్యలు  తీసుకుంటామని మంత్రి సత్యవతి తెలిపారు.