న్యూఢిల్లీ: ‘‘నాకు చావు అంటే భయం లేదు. నా కూతురిపై ఆ మృగాళ్లు అత్యాచారం చేసిన రోజే నేను చచ్చిపోయాను. ఇప్పుడు కూడా నేను వాళ్లను నిందించాలనుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలోని లొసుగులు అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్న తీరును విమర్శిస్తున్నా’’ అని అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. దోషులకు వెంటనే శిక్ష అమలు చేయడం వల్ల తన కూతురు లాంటి ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడే సాహసం ఇకముందు ఎవరూ చేయలేరని పేర్కొన్నారు. ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం, పలు సార్లు దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేలు, అనేక పిటిషన్ల అనంతరం నిర్భయ దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌ను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఆశాదేవి.. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. డిసెంబరు 16, 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేసుకున్నారు. తన కూతురిపై జరిగిన అత్యాచార కాండ, హత్య, దోషులకు శిక్ష వేయించడానికి తాము చేసిన పోరాటం గురించి పంచుకున్నారు. మానవ హక్కుల పేరిట దోషులను రక్షిస్తున్నారంటూ విమర్శించారు. మరోసారి నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడితే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన జాడ తెలియలేదు.. శరీరమంతా రక్తం
‘‘ఆరోజు ఆదివారం. దాదాపు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో నిర్భయ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రెండు- మూడు గంటల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పింది. రాత్రి ఎనిమిది అవుతున్నా తన నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో తనకు పలుమార్లు ఫోన్ చేశాం. కానీ కాల్ కట్ అయ్యింది. వెంటనే నేను, నా కొడుకు బస్టాండ్‌కు వెళ్లి తనకోసం వెతికాం. అయినా తన జాడ తెలియరాలేదు. దాదాపు రాత్రి 10 గంటలకు అనుకుంటా. నిర్భయ వాళ్ల నాన్న ఇంటి వచ్చారు. ఆయన కూడా తనకోసం వెదకడం ఆరంభించారు. పదకొండు గంటల వరకు మేం బయటే నిల్చుని ఉన్నాం. తనకోసం ఎదురుచూస్తున్నాం. ఇంతలో సఫ్దార్‌జంగ్ ఆస్పత్రి నుంచి కాల్ వచ్చింది. మా ఆయన ఫోన్ ఎత్తగానే.. నిర్భయ ఆస్పత్రిలో ఉందని.. తనకు గాయాలయ్యాయని చెప్పారు. వెంటనే మేం అక్కడికి చేరుకున్నాం. ఆలోగా తనను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను చూడగానే నిర్భయ ఏడ్వడం మొదలుపెట్టింది.